IND vs SA : దక్షిణాఫ్రికా గడ్డ మీద భువి చెత్త రికార్డు.. మూడో వన్డేకు భారీ మార్పులు?

వికెట్‌కు రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగలిగే భారత బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌..

Published : 23 Jan 2022 01:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వికెట్‌కు రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగలిగే భారత బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కొంతకాలంగా విఫలమవుతున్నాడు. 2019 వరల్డ్‌ కప్‌ నుంచి పవర్‌ప్లేలో 41 ఓవర్లు వేసిన భువనేశ్వర్‌ తీసిన వికెట్లు మూడంటే మూడే. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ విఫలమవుతున్న భువి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. స్లోగా ఉండే దక్షిణాఫ్రికా పిచ్‌ల మీద వికెట్ల కోసం భువి చాలా శ్రమించాడు. అయితే ఈ సిరీస్‌లో ఆడిన రెండు వన్డేల్లో కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టకపోవడం గమనార్హం. మొత్తం 18 ఓవర్లు వేసిన భువి (64, 67) 7.27  ఎకానమీతో 131 పరుగులను సమర్పించుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన గత ఐదు వన్డేల గణాంకాలను పరిశీలిస్తే భువి ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉంది. 36 ఓవర్లు వేసినా వికెట్ తీయడంలో విఫలమయ్యాడు. 6.72 ఎకానమీతో 272 పరుగులు ఇచ్చాడు. దక్షిణాఫ్రికా పిచ్‌ల మీద భువనేశ్వర్‌ బౌలింగ్‌ యావరేజీ 200కిపైగా ఉంది. ఏ దేశం మీదనైనా సరే అత్యంత పేలవమైన ప్రదర్శన చేసిన మూడో భారత బౌలర్‌ భువీనే. టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఎస్ వెంకటరాఘవన్‌ (275) ఇంగ్లాండ్‌పై తొలి స్థానంలో ఉండగా..  యూఏఈలో రాబిన్‌ సింగ్‌ (207) రెండో స్థానంలో నిలిచాడు. భువనేశ్వర్‌ దక్షిణాఫ్రికాలో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు. దాదాపు 60 ఓవర్లు బౌలింగ్ చేశాడు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టి 400 పరుగులను సమర్పించుకోవడం గమనార్హం. 

వారిని పక్కన పెడతారా?

నామమాత్రమైన మూడో వన్డేలో గెలిచి కాస్త పరువుతో ఇంటిముఖం పట్టాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. బౌలింగ్‌లో విఫలమవుతున్న భువనేశ్వర్‌ను తొలగించి రిజర్వ్‌ బెంచ్‌పై ఉన్న సిరాజ్‌ లేదా ప్రసిధ్‌లను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లోనూ మార్పులు చేయాలని టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. శ్రేయస్‌ అయ్యర్, వెంకటేశ్‌ అయ్యర్ స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్, సూర్యకుమార్‌ యాదవ్‌ను తీసుకునే వెసులుబాటు భారత్‌కు ఉంది. ఇక బుమ్రాకీ, భువనేశ్వర్‌ విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మూడో వన్డేకు  టీమ్‌ఇండియా జట్టు ఇలా ఉండొచ్చని ఓ అంచనా.. 

భారత్: కేఎల్‌ రాహుల్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్‌, రుతురాజ్‌, రిషభ్‌ పంత్, సూర్యకుమార్‌, శార్దూల్‌, అశ్విన్, దీపక్‌ చాహర్, ప్రసిధ్‌ కృష్ణ/సిరాజ్, చాహల్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని