IPL 2021: చెన్నై గెలవాలంటే ఆ ‘12 ఓవర్లే’ కీలకం

ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఒక టోర్నీని రెండు అంచెలుగా నిర్వహించారు. ఎట్టకేలకు అన్ని మ్యాచ్‌లు పూర్తి చేసుకొని రెండు జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి...

Updated : 14 Oct 2021 18:35 IST

ఫైనల్స్‌లో కోల్‌కతా స్పిన్‌ త్రయాన్ని ఎదుర్కోగలదా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఒక టోర్నీని రెండు అంచెలుగా నిర్వహించారు. ఎట్టకేలకు అన్ని మ్యాచ్‌లు పూర్తి చేసుకొని రెండు జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. అవే చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌. ప్లేఆఫ్స్‌ వరకూ ఫేవరెట్‌ జట్లుగా ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్‌ అనూహ్యంగా కోల్‌కతా చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాయి. దీంతో కోల్‌కతా ఫైనల్స్‌లో చెన్నైతో తలపడేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం స్పిన్‌ బౌలింగ్‌తో బలంగా ఉన్న ఆ జట్టును ధోనీసేన తుదిపోరులో ఓడించాలంటే తన అమ్ములపొదిలో ఉన్న అన్ని అస్త్రాలను సంధించాల్సిందే. ముఖ్యంగా కోల్‌కతా స్పిన్నర్లను ఎదుర్కోవడమే ఆ జట్టు చేయాల్సిన ప్రధాన కర్తవ్యం. 

బెంగళూరు, దిల్లీని కట్టడి చేసింది ఆ ముగ్గురే..

లీగ్‌ దశలో 10 విజయాలతో దిల్లీ.. 9 విజయాలతో బెంగళూరు ముందే ప్లేఆఫ్స్‌ బెర్తులను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగో స్థానం కోసం నాలుగు జట్లతో పోటీపడిన కోల్‌కతా, ముంబయితో సమానంగా ఏడు విజయాలతో నిలిచినా... రన్‌రేట్‌ పరంగా మెరుగ్గా ఉండటంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇక్కడ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బెంగళూరు, దిల్లీ జట్లను ఓడించింది. ఏమాత్రం ఆశలు లేని పరిస్థితుల నుంచి ఫైనల్లో చెన్నై లాంటి మేటి జట్టును ఢీకొట్టే దాకా ఆ జట్టు ప్రస్థానం కొనసాగింది. అందుకు ప్రధాన కారణం వరుణ్‌ చక్రవర్తి, షకిబ్‌ అల్‌ హసన్‌, సునీల్‌ నరైన్‌ లాంటి స్పిన్నర్లు. 

వావ్‌ అనిపించే ఎకానమీ..

షార్జా వేదికగా జరిగిన తొలి ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సునీల్‌ నరైన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బెంగళూరును భారీ దెబ్బకొట్టాడు. తొలుత బౌలింగ్‌తో నాలుగు కీలక వికెట్లు తీసిన అతడు తర్వాత బ్యాటింగ్‌లో 26 పరుగులు చేశాడు. దీంతో రెండు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీసేన విజయావశాలకు గండికొట్టాడు. అతడికి తోడు వరుణ్‌, షకిబ్‌ కట్టుదిట్టంగా బంతులేసి బెంగళూరు భారీ స్కోర్‌ చేయకుండా 138/7 పరుగులకే కట్టడి చేశారు. ఇక దిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ ఈ ముగ్గురే మరోసారి కోల్‌కతాను ఆదుకున్నారు. ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్‌ చేయకుండా నిలువరించారు. 12 ఓవర్లకు 71/2తో ఉన్న దిల్లీ.. చివరికి 135/5 స్కోరే చేసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో వరుణ్‌ (6.40), షకిబ్‌ (6.64), నరైన్‌ (6.44) ఎకానమీతో బౌలింగ్‌ చేశారు. ఈ గణాంకాలే కోల్‌కతా బౌలింగ్‌ ఎంత బలంగా ఉందో తెలియజేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫైనల్స్‌లో చెన్నై రాణించాలంటే ఈ ముగ్గుర్ని ఎదుర్కోవడమే కీలకంగా మారింది. వీరిని ధాటిగా ఆడితే చెన్నైకు తిరుగు ఉండదనే చెప్పాలి.

‘తలా’ ఓ చేయి వేస్తేనే..

గతేడాది పేలవ ఆటతీరుతో ప్లేఆఫ్స్‌ చేరకుండా ఇంటిముఖం పట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈసారి మేటి ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. అందులో ఓపెనర్లు రుతురాజ్‌ (603), ఫా డుప్లెసిస్‌ (547) కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ జట్టుకు విలువైన భాగస్వామ్యాలు జోడించారు. అనంతరం మొయిన్‌ అలీ, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, కెప్టెన్‌ ధోనీ, రాబిన్‌ ఉతప్ప ఇలా సందర్భోచితంగా రాణించి జట్టు విజయాల్లో తమవంతు పాత్ర పోషించారు. అయితే, ఈ జట్టు సాధించే స్కోర్లలో ఓపెనర్లే అధిక భాగం పని పూర్తి చేస్తున్నారు. ఒకవేళ ఫైనల్లో వీరు విఫలమైతే ధోనీసేనలో తలో చేయి వేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ప్రస్తుతం కోల్‌కతా స్పిన్నర్లు బలంగా కనిపిస్తుండటంతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది. లేదంటే 2012లో భారీ స్కోర్‌ సాధించినా చెన్నై.. కోల్‌కతా చేతిలో ఓటమిపాలైన పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ చెన్నై బ్యాట్స్‌మెన్‌లో ఏ ముగ్గురు చెలరేగినా కేకేఆర్‌పై ఆధిపత్యం చెలాయించే అవకాశం లేకపోలేదు. ఇప్పటివరకు రుతురాజ్‌ బాగా ఆడుతున్నా ఫైనల్స్‌లో చెలరేగడమే ముఖ్యంగా మారనుంది. అతడు ఇంకో 24 పరుగులు సాధిస్తే ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఆరెంజ్‌ క్యాప్‌ అందుకునే వీలుంది. ప్రస్తుతం ఈ జాబితాలో కేఎల్‌ రాహుల్‌ (626) అందరి కన్నా ముందున్నాడు.

ధోనీ అనుభవమే కీలకం..

ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోనీకి మించిన ఆటగాడు లేడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకు అతడు సాధించిన విజయాలే ఉదాహరణ. మరోవైపు దిల్లీతో జరిగిన క్వాలిఫయర్‌-1లో ధోనీ (18*; 6 బంతుల్లో 3x4, 1x6) చివర్లో దంచికొట్టి జట్టును విజయతీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అతడు కూడా ఫామ్‌లోకి వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అలా కోల్‌కతాపై ఫైనల్స్‌లోనూ మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడితే చెన్నైకి ఎదురుండదు. తన అనుభవన్నంతా ఉపయోగించి ధోనీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను నాలుగోసారి విజేతగా నిలబెట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్‌కతా బౌలర్లను ఎదుర్కోవడమే ఆ జట్టు విజయాలపై ఆధారపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని