IPL 2021: ఊపిరి పీల్చుకున్న రాహుల్‌..  నిరాశగా విలియమ్సన్

పంజాబ్ కింగ్స్‌ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ ఊపిరి పీల్చుకున్నాడు. శనివారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 5 పరుగులతో గెలిచింది...

Updated : 26 Sep 2021 09:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పంజాబ్ కింగ్స్‌ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ ఊపిరి పీల్చుకున్నాడు. శనివారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 5 పరుగుల తేడాతో గెలిచింది. అంతకుముందు రాజస్థాన్‌తో తలపడిన పోరులో రాహుల్‌ టీమ్‌ తృటిలో విజయాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సన్‌రైజర్స్‌తో ఆడిన మ్యాచ్‌లో తొలుత ఓటమిపాలయ్యేలా కనిపించినా చివరి బంతి వరకూ పోరాడి మరో ఓటమిని తప్పించుకుంది.

ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా: రాహుల్‌

‘ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉన్నా మేం మంచి స్కోర్‌ సాధిస్తే బౌలర్లు గెలిపిస్తారనే నమ్మకం కలిగించింది. ఇక షమి కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతడు విలియమ్సన్‌, వార్నర్‌ లాంటి మేటి బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేయడంతో తర్వాత మా స్పిన్నర్లకు పని తేలికైంది. మేం మరో 20-30 పరుగులు  చేసి ఉంటే స్కోరు 140-150కి చేరేది. అయితే, ఇది బ్యాటింగ్‌ పిచ్‌ కాదనే విషయాన్ని బ్యాట్స్‌మెన్‌ అర్థం చేసుకోవాలి. ఇక సన్‌రైజర్స్‌ ఆల్‌రౌండర్‌ హోల్డర్‌ అత్యద్భుతంగా ఆడాడు. తొలుత బంతితో ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన అతడు తర్వాత కష్టతరమైన పిచ్‌పై బ్యాట్‌తోనూ రాణించాడు’ అని పంజాబ్‌ కెప్టెన్‌ రాహుల్‌ పేర్కొన్నాడు.

చాలా నిరాశగా ఉంది: విలియమ్సన్‌

‘మా బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో ఎలాంటి లోపం లేదు. అయితే, పిచ్‌ ఒక్కటే కఠినంగా ఉంది. మేం కొన్ని భాగస్వామ్యాలు నిర్మించి ఉంటే బాగుండేది. హోల్డర్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మంచి ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా తన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లాడు. అయితే వరుస ఓటములతో ఈ సీజన్‌ నిరాశ కలిగించింది. మేం ఎక్కడెక్కడ మెరుగవ్వాలో పరిశీలించుకోవాలి. పంజాబ్‌ బాగా ఆడింది. మాపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. కానీ, ఈ పిచ్‌పై షాట్లు ఆడటం అంత తేలికకాదు. మేం సరైన భాగస్వామ్యాలు నిర్మించాల్సింది. ఇలాంటి పిచ్‌పై వికెట్లు కోల్పోకుండా వారిపై ఆధిపత్యం చెలాయించడం చాలా కష్టం. ఇక తర్వాతి మ్యాచ్‌పై దృష్టిపెట్టి మంచి ప్రదర్శన చేయాడానికి ప్రయత్నిస్తాం’ అని విలియమ్సన్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని