IPL 2021: హ్యాట్రిక్‌ అవకాశం కోల్పోయిన ముంబయి ఇండియన్స్‌

ఐపీఎల్‌ 14వ సీజన్‌ తుది అంకానికి చేరింది. ఇక ప్లేఆఫ్స్‌ మాత్రమే మిగిలాయి. పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన దిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి...

Updated : 10 Oct 2021 12:19 IST

చెన్నై సూపర్‌ కింగ్స్‌ రికార్డు పదిలం..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ తుది అంకానికి చేరింది. ఇక ప్లేఆఫ్స్‌ మాత్రమే మిగిలాయి. పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన దిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా, డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్‌ ఈసారి త్రుటిలో ప్లేఆఫ్స్‌ అవకాశాలను చేజార్చుకొంది. దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేరిట ఉన్న ఓ ఘనమైన రికార్డును ఆ జట్టు చేరుకోలేక చతికిలపడింది.

* వరుసగా మూడోసారి ఫైనల్స్‌ చేరే అవకాశాన్ని ముంబయి కోల్పోయింది. గత రెండు సీజన్లలో ఛాంపియన్స్‌గా అవతరించిన రోహిత్‌ జట్టు.. ఈసారి 14 పాయింట్లతో కోల్‌కతాతో సమానంగా నిలిచింది. కానీ, రన్‌రేట్‌ పరంగా కాస్త వెనుకంజలో ఉండటంతో ప్లేఆఫ్స్‌కు వెళ్లలేకపోయింది. ఇక చెన్నై గతంలో వరుసగా మూడేళ్లు ఫైనల్స్‌ చేరి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. 2010, 2011లో ఛాంపియన్స్‌గా నిలిచిన ధోనీసేన తర్వాత రెండేళ్లు రన్నరప్‌గా నిలిచింది. చెన్నై తర్వాత ముంబయి ఆ రికార్డును చేరుకోలేకపోయింది.

* పంజాబ్‌ కింగ్స్‌ ఈసారి కూడా ఆశించినంత మేర రాణించలేక చతికిలపడింది. వరుసగా ఏడోసారి ప్లేఆఫ్స్‌ చేరుకోలేకపోయింది. దీంతో ఇప్పటివరకు దిల్లీ క్యాపిటల్స్‌తో సమానంగా ఉన్న ఈ పేలవ ప్రదర్శన రికార్డును అధిగమించింది. దిల్లీ 2013 నుంచి 2018 వరకు వరుసగా ఆరేళ్లు ప్లేఆఫ్స్‌ చేరలేదు. ఇప్పుడు పంజాబ్‌ ఏడేళ్లు విఫలమైంది. 2014లో చివరిసారి ఈ జట్టు ప్లేఆఫ్స్‌ చేరింది.

* మరోవైపు దిల్లీ క్యాపిటల్స్‌ అరుదైన రికార్డును కోల్పోయింది. ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో 20 పాయింట్ల కన్నా ఎక్కువ సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. 2014లో పంజాబ్‌ 22 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్‌ చేరగా దిల్లీ ఈసారి ఆ రికార్డును చేరుకునేలా కనిపించింది. కానీ, చివరి మ్యాచ్‌లో బెంగళూరుతో ఓటమిపాలై కొత్త రికార్డును అందుకోలేకపోయింది.

* 2016లో తొలిసారి ఛాంపియన్స్‌గా అవతరించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు అత్యంత నిలకడైన జట్టుగా గతంలో పేరు ఉండేది. వరుసగా ఐదేళ్లు ప్లేఆఫ్స్‌ చేరింది ఆ జట్టు. అయితే, అంతమంచి పేరున్న హైదరాబాద్‌ ఈసారి మరీ ఘోరంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలే సాధించి ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శనతో ఆఖరి స్థానంలో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని