IPL 2021: ధోనీ లేకుండా చెన్నై సూపర్‌ కింగ్స్‌ లేదు: శ్రీనివాసన్

ధోనీ లేనిదే చెన్నై సూపర్‌ కింగ్స్‌ లేదని, అలాగే తమ ఫ్రాంఛైజీ లేనిదే ధోనీ లేడని ఆ జట్టు ఓనర్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌ శ్రీనివాసన్‌ అన్నారు...

Published : 19 Oct 2021 09:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ధోనీ లేనిదే చెన్నై సూపర్‌ కింగ్స్‌ లేదని, అలాగే తమ ఫ్రాంఛైజీ లేనిదే ధోనీ లేడని ఆ జట్టు ఓనర్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌. శ్రీనివాసన్‌ అన్నారు. తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ధోనీ సారథ్యంలో నాలుగో సారి టైటిల్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం చెన్నైలోని వెంకటాచలపతి ఆలయాన్ని ఆయన ట్రోఫీతో సహా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘కోల్‌కతాపై గెలుపొంది నాలుగో సారి ఐపీఎల్‌ టైటిల్‌ సాధించడం చిరస్మరణీయం. దీంతో చెన్నై అగ్రగామి జట్టుగా ఎదిగింది. చెన్నై జట్టులో ధోనీ అంతర్భాగం. అతడు లేనిదే మా జట్టు లేదు’ అని చెప్పారు. మరోవైపు ఈ ఫ్రాంఛైజీలో ఒక్క తమిళనాడు క్రికెటర్‌ కూడా లేడని అడిగిన ప్రశ్నకు.. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో (టీఎన్‌పీఎల్‌) ఆడే 13 మంది ఆటగాళ్లు.. ఐపీఎల్‌ లేదా టీమ్‌ఇండియాలో ఆడుతున్నారని గుర్తుచేశారు. ఇప్పుడిప్పుడే టీన్‌పీఎల్‌కు ఆదరణ పెరుగుతోందని చెప్పారు. ఇక వచ్చే ఏడాది ధోనీని చెన్నైలో అట్టిపెట్టుకునే విషయంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఆటగాళ్ల రిటెన్షన్‌ పద్ధతులపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. చివరగా ఐపీఎల్ విజయోత్సవంపై మాట్లాడిన శ్రీనివాసన్‌.. ధోనీ భారత్‌కు తిరిగి వచ్చాక ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని