IPL 2021: బెంగళూరుకు కొరకరాని కొయ్యలా హైదరాబాద్

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఏదైనా గట్టి పోటీ ఇచ్చే జట్టు ఉందంటే అది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే దశాబ్దకాలంపైగా ఆ జట్టు హైదరాబాద్‌ చేతిలో ఆఖరి నిమిషాల్లో...

Published : 08 Oct 2021 01:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఏదైనా గట్టి పోటీ ఇచ్చే జట్టు ఉందంటే అది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే దశాబ్దకాలంపైగా ఆ జట్టు హైదరాబాద్‌ చేతిలో ఆఖరి నిమిషాల్లో ఓటమిపాలవుతోంది. దీంతో ప్లేఆఫ్స్‌లో చోటు కోల్పోవడం లేదా ప్లేఆఫ్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలవలేకపోవడం పరిపాటిగా మారింది. తొలుత డెక్కన్‌ ఛార్జర్స్‌ టీమ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌పై ఆధిపత్యం చెలాయించగా తర్వాత సన్‌రైజర్స్‌ ఆ బాధ్యతలు స్వీకరించింది. దీంతో 2008 నుంచి హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ బెంగళూరుకు కొరకరాని కొయ్యలా మారింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

* 2009లో డెక్కన్‌ ఛార్జర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫైనల్స్‌లో పోటీపడ్డాయి. అప్పుడు డెక్కన్‌ ఛార్జర్స్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి బెంగళూరుకు షాకిచ్చింది.

* 2012 ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు లీగ్‌ దశలో తన చివరి మ్యాచ్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో డీసీ షాకివ్వడంతో బెంగళూరు ఓటమిపాలైంది. దీంతో స్వల్ప నెట్‌రన్‌రేట్‌ తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది.

2013 ఐపీఎల్‌లో తొలిసారి పోటీలోకి వచ్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సైతం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు షాకిచ్చింది. అప్పుడు లీగ్‌ దశలో ఎస్‌ఆర్‌హెచ్‌ తన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై విజయం సాధించి బెంగళూరును ప్లేఆఫ్స్‌ చేరకుండా అడ్డుకుంది. నాలుగో స్థానంలో సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ చేరింది.

* 2015 ఐపీఎల్ లీగ్‌ దశలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ముంబయి ఇండియన్స్‌తో చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడింది. అప్పుడు ముంబయి విజయం సాధించడంతో ప్లేఆఫ్స్‌లో బెంగళూరు టాప్‌ 2లో నిలిచే అవకాశం కోల్పోయింది.

* 2016 ఐపీఎల్‌ ఫైనల్స్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తుదిపోరులో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌ విజేతగా నిలిచి బెంగళూరుకు రెండోసారి కప్పు దూరం చేసింది.

* 2020లో ప్లేఆఫ్స్‌లో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రెండు జట్లూ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఇక్కడ కూడా సన్‌రైజర్స్‌ జట్టు బెంగళూరును ఓడించింది.

* ఇక ఇప్పుడు జరుగుతున్న 2021 సీజన్‌లోనూ బుధవారం జరిగిన 52వ మ్యాచ్‌లో బెంగళూరు, హైదరాబాద్‌ జట్లు మరోసారి తలపడ్డాయి. ఇక్కడ కూడా సన్‌రైజర్స్‌ నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో కోహ్లీసేనను రెండో స్థానంలో నిలవనివ్వకుండా చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని