David Warner: పడిలేచిన కెరటం.. ప్రపంచకప్‌ అందించాడు..!

సముద్రం కాస్త వెనక్కి వెళ్లిందంటే మరింత ముందుకు దూసుకొస్తుందని అర్థం. ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సైతం అలాంటి వాడే అనడంలో ఎలాంటి సందేహం లేదు...

Updated : 15 Nov 2021 14:48 IST

సముద్రం కాస్త వెనక్కి వెళ్లిందంటే మరింత ముందుకు దూసుకొస్తుందని అర్థం. ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సైతం అలాంటి వాడే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు పడి లేచిన కెరటం. ఏడేళ్లు వరుసగా ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన అతడు ఒక్క సీజన్‌లో విఫలమయ్యేసరికి.. తన పనైపోయిందనే విమర్శలు ఎదుర్కొన్నాడు. మరీ ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ జట్టుకు ఐపీఎల్‌ ట్రోఫీ అందించిన తనని.. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించడం మరింత అవమానకరంగా మారింది. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్‌లో అడుగుపెట్టి నెల రోజులు తిరగకముందే తానేంటో నిరూపించుకున్నాడు. ఏకంగా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’గా నిలిచి విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. దీంతో ఆస్ట్రేలియా తొలిసారి టీ20 ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

పరుగులే పరుగులు..

ఐపీఎల్‌లో వార్నర్‌ తిరుగులేని బ్యాట్స్‌మన్‌ అని అందరికీ తెలిసిందే. 2014లో సన్‌రైజర్స్‌ జట్టులో చేరిన అతడు అప్పటి నుంచీ గతేడాది వరకు వరుసగా ఏడేళ్లు 500పై చిలుకు పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే మూడుసార్లు ఆరెంజ్‌ క్యాప్‌ అందుకొని తనకు మరెవరూ సాటిలేరని చాటిచెప్పాడు. 2014 సీజన్‌లో తొలిసారి 528 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్‌.. తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. 2015 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా నియమితుడై 562 పరుగులు సాధించి ఆ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇక 2016 సీజన్‌లో 848 పరుగులతో మరింత రెచ్చిపోయి ఏకంగా ఐపీఎల్‌ టైటిల్‌నే అందించాడు. అప్పుడు ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 973 తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. ఆపై వరుసగా 641, 692, 548 పరుగులు చేసి ఏటా ఆ జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు.

ఒక్కసారి విఫలమయ్యేసరికి..

అంత నిలకడగా బ్యాటింగ్‌లో రాణిస్తూ సారథిగా జట్టును ముందుండి నడిపించిన వార్నర్‌.. ఈ సీజన్‌లోనే తేలిపోయాడు. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాట్స్‌మన్‌గా విఫలమయ్యాడు. భారత్‌లో జరిగిన తొలి అర్ధ భాగంలో ఫర్వాలేదనిపించిన అతడు యూఏఈలో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో పూర్తిగా నిరాశపరిచాడు. ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండు అర్ధశతకాలతో 195 పరుగులు చేశాడు. మరోవైపు ఈసారి జట్టు కూడా మొత్తంగా చేతులెత్తేసింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి అత్యంత దారుణమైన ప్రదర్శన చేసింది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్‌ యాజమాన్యం వార్నర్‌ను పక్కనపెట్టింది. లీగ్‌ చివరి దశలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి సైతం తొలగించింది. కేన్‌ విలియమ్సన్‌కు ఆ పగ్గాలు అప్పగించింది. తుది జట్టులో అవకాశమే ఇవ్వకుండా అవమానకర పరిస్థితులు కలుగజేసింది. అయినా వార్నర్‌ అవన్నీ పెద్దగా పట్టించుకోలేదు. తనని తుది జట్టులో నుంచి తొలగించినా డగౌట్‌లో కూర్చొని జట్టు విజయాల కోసం మద్దతిచ్చాడు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సన్‌రైజర్స్‌ తరఫున ఇదే తన చివరి సీజన్‌ అనే సంకేతాలు సైతం ఇచ్చాడు.

తన విలువేంటో చాటిచెప్పాడు..

ఇక ఐపీఎల్‌ ముగిసి సరిగ్గా నెల రోజులు తిరగకముందే ఐసీసీ 2021 టీ20 ప్రపంచకప్‌లో ఈ ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఏకంగా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’గా నిలిచాడు. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 289 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.  పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ 303 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో వార్నర్‌ మూడు అర్ధ శతకాలు సాధించగా.. మరోవైపు సెమీస్‌లో పాకిస్థాన్‌పై 49, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 53 పరుగులు సాధించి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆ జట్టు తొలిసారి టీ20 క్రికెట్‌లో ఛాంపియన్‌గా అవతరించింది. ఈ ప్రదర్శనతో వార్నర్‌ తన పనైపోయిందని విమర్శించిన వారికి చెంపపెట్టులా సమాధానమిచ్చాడు. వార్నర్‌ సతీమణి క్యాండీస్‌ సైతం ఇదే విషయాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేసింది. తన భర్తని అభినందిస్తూనే.. ఫామ్‌ కోల్పోయాడని, వయసు పైబడిందని, ఆటలో వేగం తగ్గిందని విమర్శించిన వారందరినీ ఎద్దేవా చేసింది. ఏదేమైనా వార్నర్‌ నిజంగానే కీలక సమయంలో రాణించి తన జట్టును గెలిపించడమే కాకుండా తన ఆటతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇక వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో అతడిని ఏ జట్టు తీసుకుంటుందో వేచి చూడాలి.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని