AUS vs NZ Final: అన్ని మ్యాచ్‌ల్లాగే ఇదీ ఒక సాధారణ మ్యాచ్‌: విలియమ్సన్

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో తలపడే ఫైనల్‌ తమకు సాధారణ మ్యాచ్‌లాంటిదని న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. ఇది తమ కష్టానికి ప్రతిఫలమని చెప్పాడు...

Published : 14 Nov 2021 12:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో తలపడే ఫైనల్‌ తమకు సాధారణ మ్యాచ్‌లాంటిదని న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. తుదిపోరుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో అతడు మాట్లాడాడు. ‘ఇది మా కష్టానికి ప్రతిఫలం. ఆస్ట్రేలియాతో ఫైనల్‌ అంటే ఒక సాధారణ మ్యాచ్‌ లాంటిదే. ఫైనల్లో చిన్న చిన్న విషయాలపై దృష్టి సారించి, గెలవడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు మా జట్టు కలిసికట్టుగా ఆడుతోంది. ప్రతి మ్యాచ్‌లోనూ ఏదో ఒకటి నేర్చుకోవడం మాకు ముఖ్యమైన విషయం. ఫైనల్‌ మ్యాచ్‌ కూడా మాకో అవకాశంగానే భావిస్తాం’ అని విలియమ్సన్‌ అభిప్రాయపడ్డాడు.

ఇక సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక పోరులో 46 పరుగులతో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించిన డెవాన్‌ కాన్వే తుదిపోరులో ఆడటం లేదని స్పష్టం చేశాడు. ‘డెవాన్‌ కాన్వే లేకపోవడం మా జట్టుకు పెద్దలోటు. అతడు మాకు అన్ని ఫార్మాట్లలో కీలక ఆటగాడు. ఫైనల్లో ఆడకపోవడం నిరాశ కలిగించింది. ఇలా జరగడం దురదృష్టకరం. అయినా, విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాం. ఇక మా పొరుగు దేశంతో ఫైనల్‌ మ్యాచ్ ఆడటం గొప్పగా ఉంది. ఇది రెండు జట్లకూ నూతనోత్తేజం కలిగిస్తుంది. ఇది మాకు జట్టుగా ముందుకెళ్లడానికి మరో అవకాశం అని భావిస్తున్నా’ అని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ చెప్పుకొచ్చాడు. కాగా, 2015 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఇరు జట్లూ తలపడిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించి ప్రతికారం తీర్చుకోవాలని న్యూజిలాండ్‌ భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని