Peng Shuai: చైనాలో టెన్నిస్‌ పోటీల నిలిపివేత.. డబ్ల్యూటీఏ కీలక ప్రకటన

ఉన్నపళంగా చైనాలో నిర్వహించే అంతర్జాతీయ టెన్నిస్‌ పోటీలను నిలిపివేస్తున్నట్లు వుమెన్స్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ (డబ్ల్యూటీఏ) ప్రకటించింది. చైనా క్రీడాకారిణి పెంగ్‌ షువాయి...

Updated : 02 Dec 2021 13:10 IST

పెంగ్‌ షువాయి భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన స్టీవ్‌ సిమన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా ఆతిథ్యమివ్వనున్న అంతర్జాతీయ టెన్నిస్‌ పోటీలను నిలిపివేస్తున్నట్లు వుమెన్స్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ (డబ్ల్యూటీఏ) ప్రకటించింది. చైనా క్రీడాకారిణి పెంగ్‌ షువాయి ఆచూకీ, భద్రత విషయాలపై డబ్ల్యూటీఏ ఛైర్మన్‌ స్టీవ్‌ సిమన్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం ప్రకటించారు. ఈ విషయంలో డబ్ల్యూటీఏ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ నుంచి పూర్తి మద్దతు ఉందన్నారు. హాంకాంగ్‌తో సహా చైనాలో అన్ని చోట్ల జరగనున్న పోటీలను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఓ కీలక నేత, మాజీ వైస్‌ ప్రీమియర్‌ జాంగ్‌ గవోలి తనపై లైంగిక దాడి చేసినట్లు పెంగ్‌ నవంబర్‌ 2వ తేదీన ఆరోపణలు చేసింది. సామాజిక మాధ్యమాల్లో వాటిని పోస్టు చేసిన కాసేపటికే తొలగించింది. దీంతో నాటి నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఈ విషయం బయటకు పొక్కడంతో పెంగ్‌ ఆచూకీ వెల్లడించాలని పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. ఆమె ఆచూకీ ఎక్కడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ టెన్నిస్‌ స్టార్లు నోవాక్‌ జకోవిచ్‌, సెరీనా విలియమ్స్‌, నవోమీ ఒసాకా సైతం ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో డబ్ల్యూటీఏ ఛైర్మన్‌ స్టీవ్‌ కూడా పెంగ్‌ ఆచూకీపై సందేహాలు వ్యక్తం చేశారు. వెంటనే చైనా ప్రభుత్వం ఆమె భద్రతపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని, లేదంటే ఆ దేశంలో నిర్వహించే అన్ని వాణిజ్య టోర్నీలను రద్దు చేస్తామని హెచ్చరించారు.

ఆ తర్వాత డబ్ల్యూటీఏ ఛైర్మన్‌ స్టీవ్‌ సిమన్‌కు పెంగ్‌ ఒక ఈ-మెయిల్‌ చేసినట్లు చైనా అధికారిక మీడియా సంస్థ ఒకటి ట్విట్టర్‌లో పోస్టు చేసింది. తాను సురక్షితంగానే ఉన్నట్లు, గతంలో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆ మెయిల్‌లో పేర్కొనట్లు చైనా మీడియా వెల్లడించింది. దీనిపై స్పందించిన స్టీవ్‌ ఆ ఈ-మెయిల్‌పై తనకు అనుమానాలున్నాయని తెలిపారు. అనంతరం పెంగ్‌ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటి ఛైర్మన్‌ థామస్‌ బాచ్‌తో వీడియోకాల్‌లో మాట్లాడిందని, తర్వాత స్థానిక ఈవెంట్లలో కూడా పాల్గొన్నట్లు పలు వీడియోలు అక్కడి మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పెంగ్‌ ఆచూకీపై ఇంకా స్పష్టమైన సమాచారం వెల్లడికాకపోవడంతో డబ్ల్యూటీఏ తాజా నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని