Published : 18/10/2021 11:09 IST

RCB - Kohli : బెంగళూరు ‘బెంగ’ తీర్చే సారథి ఎవరు?

 ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఇదే చివరి ఏడాది అని విరాట్‌ కోహ్లీ ప్రకటించడంతో ఎలాగైనా కప్‌ కొట్టాలనే కసితో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు ఆడతారేమో అనుకున్నారంతా. అయితే రెండు అడుగుల దూరంలో ట్రోఫీ కోల్పోయింది కోహ్లీ సేన. ఈ సారి కూడా ప్లేఆఫ్స్‌లోనే నిష్క్రమించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు వచ్చే ఏడాది సీజన్‌ నుంచి ఎవరు కెప్టెన్‌గా ఉంటారనే దానిపైనా చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరు కెప్టెన్‌ అవ్వొచ్చు అనే చర్చ మీ కోసం...

ఈ సాలా నమదే.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ప్రతి సీజన్‌ ప్రారంభంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) అభిమానుల నుంచి వినిపించే స్లోగన్ ఇది‌.. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్‌కు చేరిన ఆర్‌సీబీ టైటిల్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. తమ జట్టు ఐపీఎల్‌ ట్రోఫీని సాధించాలనే కోరిక ఆర్‌సీబీ అభిమానుల తీరని కలగా నే మారింది. ఏడేళ్ల కిందట విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్‌సీబీ ఐపీఎల్‌ కప్‌ను సాధిస్తుందనే నమ్మకం వారిలో పెరిగి పోయింది. అయితే కోహ్లీ సారథ్యంలో ఒకసారి ఫైనల్‌కు (2016), రెండు సార్లు (2020, 2021) ప్లేఆఫ్స్‌కు ఆర్‌సీబీ వెళ్లింది. మిగతా అన్నిసార్లూ లీగ్‌ స్థాయిలోనే ఆగిపోయింది. ఈ ఏడాదీ ప్లే ఆఫ్స్‌లోనే ఉండిపోయింది.

ముందు వరుసలో వీరే..

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు సారథ్యం వహించనని, ఆటగాడిగా కొనసాగుతానని రెండో దశ టోర్నీ ముందే...విరాట్‌ కోహ్లీ ప్రకటించాడు. దీంతో కొత్త కెప్టెన్‌ ఎవరు? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే కెప్టెన్‌గా కొనసాగాలని ఆర్‌సీబీ యాజమాన్యం కోహ్లీని అడిగే అవకాశం ఉంది. అప్పటికీ అతను తన నిర్ణయం మార్చుకోకపోతే... కొత్త కెప్టెన్‌ ఎంపిక తప్పనిసరి. అయితే ప్రస్తుతం ఉన్న జట్టులో కెప్టెన్‌ అయ్యే అవకాశం ఉన్నది ఇద్దరికే. ఒకరి మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌, రెండోది గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌. రిటైన్‌ పద్ధతిలో ఆటగాళ్లను ఉంచుకుంటే కోహ్లీని బెంగళూరు తప్పక ఉంచుకుంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. అతనితోపాటు సీనియర్‌ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, మాక్స్‌వెల్‌ కూడా రిటైన్‌ రేసులో ఉన్నారు. వారినీ రిటైన్‌ చేసుకుంటే... అప్పుడు ఆ ఇద్దరిలో ఒకరు కెప్టెన్‌ అవుతారు. ఎక్కువ అవకాశాలు మాత్రం మాక్స్‌వెల్‌కు ఉన్నాయంటున్నారు. ఐపీఎల్‌ 2021కి ముందు జరిగిన వేలంలో మ్యాక్సీని రూ.14.25 కోట్ల భారీ మొత్తానికి ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. అందుకు తగ్గట్టే... కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన మాక్స్‌వెల్‌ (513 పరుగులు) తన ధరకు న్యాయం చేశాడు. అయితే బౌలింగ్‌లో రాణించలేదు.

* పదకొండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన ఏబీ డివిలియర్స్‌ ఈ సీజన్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. 15 మ్యాచుల్లో కేవలం 313 పరుగులు మాత్రమే చేశాడు. హార్డ్‌ హిట్టర్‌గా పేరున్న ఏబీడీ గతేడాది ఫర్వాలేదనిపించినా.. ఈ సారి మాత్రం కీలక సమయంలోనూ రాణించలేదు. దీంతో సరైన ఫామ్‌లో ఏబీడీ లేకపోవడంతో కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం కష్టమే అంటున్నారు. వచ్చే ఏడాది బ్యాటింగ్‌ మెరుగుపరుచుకోకపోతే జట్టులో స్థానం కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉందనే వాదనా ఉంది.

* దిల్లీ, పంజాబ్‌ తరహాలో యువ క్రికెటర్‌ని కెప్టెన్‌గా నియమించాలని ఆర్‌సీబీ యాజమాన్యం భావిస్తే మాత్రం దేవదత్‌ పడిక్కల్‌ ఒక్కడే ముందు వరుసలో ఉంటాడు. ఆర్‌సీబీ తరఫున ఓపెనర్‌గా దిగుతూ మంచి ఇన్నింగ్స్‌లను ఆడాడు. గత రెండేళ్ల నుంచి మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కాకపోతే వయసురీత్యా (21 ఏళ్లు) బాగా చిన్నవాడు. పోయిన సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున ఎక్కువ పరుగులు (473) సాధించిన ఆటగాడు కూడా దేవదత్ కావడం విశేషం. ఈ సారి కూడా  మాక్స్‌వెల్‌ తర్వాత ఆర్‌సీబీలో ఎక్కువ స్కోరు (411) సాధించాడు. కోహ్లీ సారథ్యంలో ఓపెనర్‌గా రాటుదేలిన దేవదత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే అద్భుతమే అవుతుందని చెప్పాలి. మహ్మద్‌ సిరాజ్‌, శ్రీభరత్, హర్షల్‌ పటేల్, చాహల్ ఉన్నా.. ఇందులో రిటైన్‌ అయ్యేదెవరో చూడాలి. 

* వచ్చే ఏడాది మెగా వేలంలో కొత్తగా ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది. అలాంటి పక్షంలో పూర్తిగా కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యలను అప్పగించొచ్చు. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు డేవిడ్‌ వార్నర్‌ను వదులుకుంటే వేలంలో ఆర్‌సీబీ తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. వార్నర్‌ను తీసుకుంటే ఇటు సూపర్‌ బ్యాటర్‌ స్థానంతోపాటు సారథ్య బాధ్యతలను అప్పగించొచ్చు. 2016లో డేవిడ్‌ వార్నర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన విషయం తెలిసిందే. అలానే దిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ వేలానికి వస్తే... ఆర్‌సీబీ దక్కించుకుని సారథ్య బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్యపోననక్కర్లేదు. అలా... కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటే... కెప్టెన్‌ ఎంపిక అంత సులువేమీ కాదు. 

కోహ్లీ నేతృత్వంలో ఆర్‌సీబీ ఇలా..

* విరాట్‌ కోహ్లీ ఐపీఎల్‌ 2016 సీజన్‌లో చెలరేగిపోయి జట్టును తుదిపోరుకు తీసుకువచ్చాడు. భారీ స్కోర్లు నమోదైన ఫైనల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మీద ఆర్‌సీబీ ఎనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ 208 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్ (69), శిఖర్ ధావన్‌ (28), యువరాజ్‌ సింగ్‌ (38), బెన్‌ కటింగ్‌ (39) ధాటిగా ఆడారు. అనంతరం క్రిస్‌ గేల్‌ (76), విరాట్‌ కోహ్లీ (54) రాణించడంతో ఒకానొక దశలో ఆర్‌సీబీ గెలిచేలా కనిపించింది. వీరిద్దరూ పెవిలియన్‌కు చేరిన తర్వాత మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో చివరికి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో తృటిలో ఐపీఎల్‌ టైటిల్‌ను ఆర్‌సీబీ కోల్పోయింది. తర్వాత మూడేళ్లు (2012, 18, 19 సీజన్లు) లీగ్‌ దశలోనే ప్రయాణం ముగిసింది. గతేడాది (2020) ప్లేఆఫ్స్‌కు వచ్చినా సన్‌రైజర్స్‌ చేతిలోనే భంగపాటు తప్పలేదు.

* గత చేదు అనుభవాలను చెరిపేస్తూ.. రెండు విడతలుగా జరిగిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ను ఆర్‌సీబీ ఘనంగా ప్రారంభించింది. ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఇదే చివరి ఐపీఎల్ అని విరాట్‌ కోహ్లీ ప్రకటించడంతో ఎలాగైనా కప్‌ను సాధించి తీరాలని ప్రతి ఆటగాడు భావించాడు. అదే క్రమంలో పాయింట్ల పట్టికలో టాప్‌-త్రీలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. అప్పటి వరకు బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించి జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చారు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు సాధించిన టాప్‌ బౌలర్‌గా ఆర్‌సీబీ ఆటగాడు హర్షల్‌ పటేల్‌ (32) నిలిచాడు. అయితే ఎలిమినేటర్‌లో కోల్‌కతా చేతిలో ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తొలుత ఆర్‌సీబీ 138/7 స్కోరును చేయగా.. కేకేఆర్‌ ఆరు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో కప్‌ను సాధించాలనే కల అలాగే మిగిలిపోయింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని