Twitter: ఉన్నట్టుండి ట్విటర్‌ ఫాలోవర్లు ఎందుకు తగ్గుతున్నారు?

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ వేదిక ట్విటర్‌లో ఉన్నట్లుండి కొందరి వ్యక్తులకు ఫాలోవర్లు తగ్గుతున్నారు. పలువురు వందల సంఖ్యలో ఫాలోవర్లను ఒక్కసారిగా కోల్పోగా.. కొందరైతే వేల సంఖ్యలో అనుచరులను కోల్పోయారు.

Updated : 05 Dec 2021 19:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ వేదిక ట్విటర్‌లో ఉన్నట్లుండి కొందరి వ్యక్తులకు ఫాలోవర్లు తగ్గుతున్నారు. పలువురు వందల సంఖ్యలో ఫాలోవర్లను ఒక్కసారిగా కోల్పోగా.. కొందరైతే వేల సంఖ్యలో అనుచరులను కోల్పోయారు. ఈ విషయమై పలువురు ఇదే ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, అందులోని చాలా వరకు ఫాలోవర్లను ట్విటర్‌ పునరుద్ధరించింది.

ట్విటర్‌ బాట్స్‌ను తొలగించడంతో పాటు, నిద్రాణంగా ఉన్న ఖాతాలను తొలగించే ప్రక్రియలో భాగంగా ట్విటర్‌ చేపట్టిన క్లీన్‌ఆప్‌ ప్రక్రియ వల్ల ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. స్పామ్‌, బాట్స్‌ను తొలగించి ఖాతాలను సురక్షితంగా ఉంచే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ చేపట్టినట్లు ట్విటర్‌ తెలిపింది. ఖాతాదారులు తమ ఫోన్‌నంబర్‌, పాస్‌వర్డ్‌ను ఒకసారి వెరిఫై చేసుకున్నాక ఆయా ఖాతాలను పునరుద్ధరిస్తామని పేర్కొంది. నిరంతరం జరిగే ప్రక్రియలో భాగంగానే దీన్ని చేపట్టినట్లు ట్విటర్‌ వివరించింది. ట్విటర్‌ చేపట్టిన ఈ ప్రక్రియ వల్ల గతంలో బాలీవుడ్‌ నటుడు అనపమ్‌ ఖేర్‌ సుమారు 80 వేల మంది అనుచరులను కోల్పోయారు. ఇదే విషయమై అప్పట్లో ఆయన ట్వీట్‌ కూడా పెట్టారు.

మరోవైపు ట్విటర్‌లో ఫాలోవర్లు తగ్గడంపై కొందరు మీమ్స్‌ రూపొందించి ట్విటర్‌లో ఉంచారు. అదే సమయంలో ట్విటర్‌ కొత్త సీఈవోగా నియమితులైన పరాగ్‌ అగర్వాల్‌ ఫాలోవర్లు పెరగడంతో ఇంకొందరు వినూత్నంగా స్పందించారు. ‘ఓహ్‌! ఇప్పుడర్థమైంది. ఇక్కడ కోల్పోయిన ఫాలోవర్లంతా ఎక్కడకి వెళ్తుతున్నారో’ అంటూ కాస్త చమత్కారంగా స్పందించడం గమనార్హం. పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు కోల్పోయిన వారిని చూసి.. తక్కువ మంది ఫాలోవర్లు కలిగిన ఖాతాదారులు పండగ చేసుకుంటున్నట్లు మరొకరు సరదాగా మీమ్‌ రూపొందించారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని