CM KCR: ఉపేక్షించం

తెలంగాణ నుంచి వరి ధాన్యాన్ని తీసుకునే విషయంలో కేంద్రం అసంబద్ధ, ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని, ఇది రాష్ట్ర కర్షకులకు, దేశ వ్యవసాయరంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఒకేలా సేకరణ జరిగేలా... తక్షణమే సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం ప్రకటించాలని డిమాండు చేశారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి

Updated : 29 Nov 2021 03:52 IST

డిమాండ్ల సాధనకు సభలో, బయటా ఆందోళనలు

కేంద్రానిది అసంబద్ధ, ద్వంద్వ వైఖరి...

సమగ్ర జాతీయ ధాన్య సేకరణ విధానం ప్రకటించాలి

పార్లమెంటు వేదికగా కేంద్రం తీరును ఎండగడదాం

ప్రాజెక్టులు, నిధుల కోసం ఒత్తిడి తేవాలి

తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి వరి ధాన్యాన్ని తీసుకునే విషయంలో కేంద్రం అసంబద్ధ, ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని, ఇది రాష్ట్ర కర్షకులకు, దేశ వ్యవసాయరంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఒకేలా సేకరణ జరిగేలా... తక్షణమే సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం ప్రకటించాలని డిమాండు చేశారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, దీనిపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణ పట్ల సానుకూలంగా లేదని, ఏడేళ్లుగా ఓపిక పట్టామని, ఇక ఉపేక్షించేది లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు సంబంధించి తీవ్ర ఒత్తిడి తేవాలని, తెలంగాణ వాణిని పార్లమెంటులో గట్టిగా వినిపించాలని... సభ బయటా నిరసనలు తెలపాలని స్పష్టం చేశారు. సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. దీనికి తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, వ్యవసాయ, రోడ్లుభవనాల శాఖల మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు లక్ష్మీకాంతరావు, కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి, జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, బీబీపాటిల్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్‌, మాలోత్‌ కవిత, బి.వెంకటేశ్‌ నేత, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

ప్రగతిభవన్‌లో ఆదివారం జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న తెరాస

అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌. చిత్రంలో, మంత్రి నిరంజన్‌ రెడ్డి, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు

అన్నింటా అన్యాయమే

‘ఏడేళ్లుగా తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదు. విభజన హామీలను పూర్తిగా విస్మరించింది. ధాన్యం సేకరణపై కేంద్రం తీరు దారుణంగా ఉంది. రైతుల గురించి ఆలోచించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలను పెడచెవిన పెట్టింది. ఈ వానాకాలంలో వరిధాన్యం సాగు విస్తీర్ణం విషయంలో పూటకోమాట మాట్లాడుతూ కిరికిరి పెడుతోంది. 90 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం సేకరించాల్సి ఉండగా... 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని(40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని) మాత్రమే సేకరిస్తామని కేంద్రం మళ్లీ పాతపాటే పాడుతోంది. రాష్ట్ర రైతుల సమస్యనే అత్యంత ప్రాధాన్యాంశంగా పార్లమెంటులో లేవనెత్తాలి. కనీస మద్దతు ధర చట్టం, విద్యుత్‌ చట్టం రద్దు కోసం పోరాడాలి. నదీజలాల్లో రాష్ట్ర వాటా ఖరారు కోసం పట్టుబట్టాలి. కేంద్రం వైఖరి ఎలా ఉన్నా తెలంగాణలో రైతులకు యథావిధిగా ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తాం’ అని తెలిపారు.

పాల్గొన్న ఎంపీలు

కేంద్రం వైఖరిపై సమావేశం అసంతృప్తి

ధాన్యం దిగుబడిలో అనతి కాలంలో మన కర్షకులు.. దేశ రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్న క్రమంలో, కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తెలంగాణ వ్యవసాయ రంగానికి అశనిపాతంగా మారిందని పార్లమెంటరీ పార్టీ సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం దిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ని, కేంద్ర ప్రభుత్వ అధికారులను కలసి విజ్ఞప్తి చేసినా ఎటూ తేల్చడం లేదని పేర్కొంది. వార్షిక ధాన్యసేకరణ క్యాలండర్‌ను విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ చక్కటి సూచన చేసినా కేంద్రం స్పందించడం లేదని, అయోమయం, అస్పష్టతతో గందరగోళం సృష్టిస్తోందని, దీనిపై పోరాడాలని నిర్ణయించింది.

ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష

అంతకుముందు ప్రగతిభవన్‌లో ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల సారాంశాన్ని సీఎంకు మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని