china: చైనాలో జననాల కరవు

ఏ దేశాన్నైనా జనాభా విస్ఫోటం భయపడుతుంది. చైనాను మాత్రం గత కొన్నాళ్లుగా

Updated : 18 Jan 2022 12:11 IST

వరుసగా ఐదో ఏడాదీ తగ్గిన వృద్ధి

బీజింగ్‌: ఏ దేశాన్నైనా జనాభా విస్ఫోటం భయపడుతుంది. చైనాను మాత్రం గత కొన్నాళ్లుగా జనాభా తగ్గుదల కలవరపెడుతోంది. సోమవారం ఆ దేశ జాతీయ గణాంకాల విభాగం(ఎన్‌బీఎస్‌) విడుదల చేసిన తాజా డేటా.. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న డ్రాగన్‌ ఆశలకు గండికొట్టేలా ఉంది. గత ఏడాది కాలంలో ఆ దేశ జనాభాలో స్వల్ప వృద్ధి మాత్రమే నమోదైంది. 2020లో చైనా జనాభా 141 కోట్ల 20 లక్షలు. తాజా 2021 గణాంకాల ప్రకారం 141 కోట్ల 26 లక్షలు. అంటే జాతీయ వృద్ధి రేటు 1000 మందికి 0.34 మాత్రమే మాత్రమే. గత ఏడాది చైనాలో కోటి 62 లక్షల కొత్త శిశువులు మాత్రమే జన్మించారు.

ఇంత తక్కువ సంఖ్య నమోదు కావడం 1950 తర్వాత ఇదే తొలిసారి. శిశు జననాల రేటు ప్రతి 1000 మందికి 7.52 మాత్రమే. 1978 తర్వాత ఇదే కనిష్ఠస్థాయి. గత ఐదేళ్లుగా శిశు జననాల రేటులో తగ్గుదలే కనిపిస్తోంది. మరోవైపు దేశంలో వృద్ధుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతోంది. 60 ఏళ్లు దాటిన వారు 26.4 కోట్లకు చేరుకున్నారు. 2020తో పోలిస్తే 18.7% అధికం. దీని వల్ల పింఛన్లు...ఇతర ప్రయోజనాల భారం ఆర్థికవ్యవస్థపై తీవ్రంగా పడనుంది.  జనాభా పెరుగుదల కోసం 2016లో ఏక సంతాన నిబంధనకు చైనా వీడ్కోలు పలికింది. 2020లో ముగ్గురు పిల్లల విధానాన్ని తీసుకువచ్చింది. ఈ ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుందని.. అప్పటివరకు జన సంఖ్యలో పెద్దగా ఎదుగుదల ఉండదని చైనా జాతీయ అభివృద్థి, సంస్కరణల కమిషన్‌ ఉపాధ్యక్షుడు నింగ్‌ జిజె తెలిపారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని