నేల విడిచి సాగు..
close
Published : 25/05/2020 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేల విడిచి సాగు..

కుళాయి నీటితో దిగుబడి భళా

అరక పట్టే పనిలేదు... మెరక దున్నే అవసరం అంతకన్నా లేదు... మాగాణం లేకున్నా.. ఇంటి ప్రాంగణాన్నే వ్యవసాయ క్షేత్రంగా మార్చేయొచ్ఛు.. కుళాయి నీటినే మితంగా సరిపెట్టుకోవచ్ఛు.. ఏడాది పొడవునా పంట పండించుకోవచ్ఛు.. ఇలాంటి కొత్తరకం సాగుబడితో ఊహించని దిగుబడులు సాధిస్తున్నారు భాగ్యనగర రైతు మండ్ల లక్ష్మి... ‘జల సాగు’ విధానంతో భళా అనిపించుకున్న ఈ ఆధునిక సేద్యకారిణి అనుభవాలివి.

న్నింట్లో హైటెక్‌ పద్ధతులు వచ్చినట్టే.. వ్యవసాయమూ కొత్తపుంతలు తొక్కుతోంది. తరిగిపోతున్న సహజ వనరులను సద్వినియోగం చేసుకునే క్రమంలో కొత్తరకం సేద్య విధానాలు తెరమీదికొస్తున్నాయి. భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా వినూత్న మార్పుగా చెప్పుకొంటున్న విధానం జల సాగు. అదే హైడ్రోపోనిక్‌ విధానం. ఇంకా చెప్పాలంటే నేల విడిచి సాగు చేయడమన్నమాట. ఈ పద్ధతిలో మట్టితో పని లేకుండా పంటలు పండిస్తున్నారు పలువురు ఔత్సాహిక రైతులు, వ్యవసాయంపై ఆసక్తి ఉన్న యువత. ఈ కోవకే చెందుతారు లక్ష్మి.


ఏడాదిలో రాబడి

లక్ష్మి ఎంసీఏ పట్టభద్రురాలు. ఆమె భర్త సత్యనారాయణరెడ్ఢి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేసేవారు. దంపతులు ఇద్దరూ అమెరికా వెళ్దామనుకున్నా కొన్ని కారణాలతో ప్రయాణం రద్దయింది. సొంతంగా వ్యవసాయం చేయాలనుకున్నారు. రసాయన అవశేషాల్లేని పంటలు పండించాలనుకున్నారు. భర్త సహకారంతో హైడ్రోపోనిక్‌ విధానంపై అధ్యయనం చేశారు లక్ష్మి. జల సేద్యం సాధ్యాసాధ్యాలపై అనేక కోణాల్లో పరిశీలించారు. కొంపల్లిలో ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో ఇల్లు కట్టుకొని ఆ పక్కనే 2000 చదరపు అడుగుల స్థలంలో పాలీహౌజ్‌ వంటి నిర్మాణం చేపట్టారు. రూ.15 లక్షల పెట్టుబడితో ‘ఇన్ఫినిటీ గ్రీన్‌ ఫామ్స్‌’ పేరిట గతేడాది ఏప్రిల్‌లో జల సాగుకు శ్రీకారం చుట్టారు. రెండు మూడు మాసాల్లో సేద్యంపై పూర్తి పట్టు సాధించారు లక్ష్మి. ఏడాది తిరిగేలోపు పెట్టుబడి మొత్తాన్ని రాబట్టగలిగారు.


మట్టి మాట లేకుండానే..

ఈ పద్ధతిలో మట్టి వినియోగం ఉండదు. క్రిమిసంహారక రసాయనాలు వాడరు. సాగంతా సేంద్రియ పద్ధతిలోనే కొనసాగుతుంది. పర్యావరణహిత పద్ధతుల్లో నీటితోపాటు వర్మ్‌వాష్‌, పీఎస్‌బీ, నైట్రోజన్‌ ఫిక్సింగ్‌, మంచి బ్యాక్టీరియా జోడించి అభివృద్ధి చేసిన మిశ్రమం, జింక్‌, బోరాన్‌ తదితర 13 రకాల పోషకాలు సమతులంగా ఇచ్చి భారీ దిగుబడులు సాధిస్తున్నారు. దీనికోసం యాభై లీటర్ల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌ ఏర్పాటు చేశారు. ఇందులో పోషకాలు సమపాళ్లలో కలిపిన నీళ్లుంటాయి. ప్రత్యేక నిర్మాణం ద్వారా మొక్కలకు నీరు సరఫరా అవుతుంది. మొక్కలు పీల్చుకోగా మిగిలిన నీరు మళ్లీ రిజర్వాయర్‌లోకే వెళ్లేలా ఏర్పాటు ఉంటుంది. దీంతో 90 శాతం నీరు ఆదా చేయగలిగారు. కుళాయి నీటినే వాడారు. ‘సాధారణ సాగులో ఆకుకూరలు చేతికి రావాలంటే నలభై రోజులు పడుతుంది. జలసేద్యంలో నెల రోజుల్లో పంట చేతికొస్తుంది. ప్రతి పదిహేను రోజులకు ఒక రకం సాగు చేయగలిగితే.. ఏడాది పొడవునా పంట అందుబాటులో ఉంటుంది. మట్టితో పోల్చితే.. ఈ విధానంలో మొక్క ఎదుగుదల నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంద’ంటారు లక్ష్మి. అమెరికాలో ఆకుకూరల్లో రారాజుగా పిలిచే కేల్‌, ఇటాలియన్‌ బెసిల్‌, థాయ్‌ బెసిల్‌, లెట్యూస్‌, పార్సిలీ తదితర ఆకుకూరలతో పాటు కొత్తిమీర, పుదీనా, మెంతికూర వంటివి సాగు చేస్తున్నారిక్కడ. చుట్టుపక్కల గేటెడ్‌ కమ్యూనిటీ వాసులు ఇక్కడికే వచ్చి కొనుగోలు చేస్తున్నారు.


ఇళ్లలోనూ..

తక్కువ స్థలంలో.. ఇంటి బాల్కనీ, టెర్రస్‌పై పరిమిత బడ్జెట్‌లో కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవచ్చంటారు లక్ష్మి. ఆసక్తి ఉన్నవారికి ఇన్‌స్టలేషన్‌ చేయడంతో పాటు అవసరమైన శిక్షణ, సూచనలూ ఇస్తున్నారు. ‘సూర్యకాంతి నేరుగా మొక్కలపై పడకుండా ఏర్పాటు చేసుకోవాలి. హైడ్రోపోనిక్‌ అంటే ఖర్చు ఎక్కువ అవుతుందనే భావన ఉంది. అది సరికాదు. ఒక్కసారి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే.. తక్కువ ఖర్చులో నాణ్యమైన, రసాయన అవశేషాలు లేని ఆహారం లభిస్తుంది. కూలీల అవసరం అంతగా ఉండదు. మహిళలు సులభంగా సాగు చేయొచ్చ’ని చెబుతారామె. రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో.. జలసాగు విధానంతో పోషకాలు దండిగా ఉండే పంటలు స్వయంగా పండించుకుంటే మేలంటున్నారు.


ఇదేం విధానం అన్నారు!

మేం ఎంచుకున్న మార్గం కొత్తది. ఎన్ని పరిశోధనలు చేసినా.. కార్యరూపం దాల్చడంలో సవాళ్లు ఎదురవుతాయి. మొదట్లో మట్టి లేకుండా పంటలు పండించడం ఏమిటి? అని అనుకునేవారంతా! రసాయనాలు లేని ఆరోగ్యకరమైన పంటలని తెలిసి.. చాలామంది ఆసక్తి చూపించారు. ఆ నోటా ఈ నోటా.. మంచి ప్రచారం లభించింది. కాయగూరల కోసమే కాదు.. సాగు పద్ధతి గురించి తెలుసుకోవడానికి ఎందరో వస్తున్నారిప్పుడు. తమ ఇళ్లలో, ఫామ్‌హౌస్‌లో హైడ్రోపోనిక్‌ సాగు ప్రారంభించడానికి సాయం కోరుతున్నారు. మలేసియా, నైజీరియా దేశాల నుంచీ కొందరు మా విధానంపై ఆసక్తి చూపించారు. ఇప్పుడిప్పుడే చేరువవుతున్న జలసాగు రానున్న కాలంలో అందరికీ ఆరోగ్యకరమైన కాయగూరల్ని అందిస్తుందనడంలో సందేహం లేదు.

- మల్లిక్‌ బస్వోజు, ఈటీవీ, హైదరాబాద్‌


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని