మీ ఆరోగ్యం..చల్లగుండ!
close
Published : 26/05/2020 00:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ ఆరోగ్యం..చల్లగుండ!

రోహిణి కార్తెలో రోళ్లు కూడా పగులుతాయంటారు... ఈ వడగాల్పులు.. ఉక్కబోత చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది... ఇంట్లో వయసుమళ్లిన పెద్దవాళ్లుంటారు.. పసిపిల్లలూ ఉంటారు.. చిన్నాపెద్ద అని కాకుండా ఈ కాలంలో అందరి ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోవాల్సింది మనమే. ఎండదెబ్బ బారినపడకుండా ఆహారపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో చూద్దాం!

వేడిగాలుల కారణంగా ఒంట్లో తేమ తగ్గి శరీరంలో నీటి నిల్వలు హరించుకుపోతాయి. అవసరమైన ఖనిజ లవణాలు చెమట రూపంలో బయటికి పోతాయి. దాంతో శరీరం నిస్సత్తువగా మారుతుంది. దీన్నే వడదెబ్బ అంటాం.

ఎలాంటి లక్షణాలు ఉంటాయి...

తలనొప్పి, కళ్లు తిరగడం, నోరు ఆరిపోవడం, కండరాల నొప్పులు, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు చేసుకోవడం, మూత్ర సంబంధిత సమస్యలు వంటివెన్నో దీని లక్షణాలు. ఇవన్నీ ఎండబారిన పడిన కొద్దిగంటల్లోనే ప్రభావం చూపిస్తాయి.

వడదెబ్బ తగిలితే....

* తక్షణం చికిత్స అందించాలి. చల్లటి గాలి తగిలే ప్రదేశంలో ఉండి విశ్రాంతి తీసుకోవాలి.

* దుస్తుల్ని వదులుగా చేయాలి.

* ఉప్పు, పంచదార కలిపిన చల్లటి నీళ్లను తాగించాలి. ఆపై వైద్యుల దగ్గరకు తీసుకెళ్లడం మంచిది.

ఈ పరిస్థితి రాకూడదంటే...

ప్రధానంగా ఆహారంలో తగినన్ని మార్పులు చేసుకోవాలి. శరీరంలో నీటి నిల్వలు, మరీ ముఖ్యంగా ఎలక్ట్రోలైట్స్‌ తగ్గకుండా చూసుకోవాలి. మరో పక్క జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. అంటే... నూలు దుస్తులు ధరించడం, కళ్లజోడు పెట్టుకోవడం, బయటకి వెళ్లినప్పుడు గొడుగుని ఉపయోగించడం, చర్మానికి సన్‌స్క్రీన్‌లోషన్‌ రాసుకోవడం వంటివి చేయాలి.


ఆహారం విషయంలో...

రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడే ఎలక్ట్రోలైట్స్‌ శరీరానికి తగినంతగా అందుతాయి. పాలకూరలో 92% నీరు ఉంటుంది. అదే క్యారెట్‌లో 87%, ఎర్రటి టొమాటోల్లో 94శాతం నీరు ఉంటుంది. ఈ కాలంలో ముల్లంగి, సొరకాయ వంటివి ఎక్కువగా తీసుకోవడం మేలు. అలానే ఈ కాలంలో దొరికే బత్తాయి, నిమ్మ, పుచ్చకాయ, కర్భూజా వంటి పండ్లను తరచూ తీసుకోవాలి. ఇవి శరీరానికి తగిన నీరు అందించడంతో పాటు పీచు, ఇతర పోషకాల్ని అందిస్తాయి. ఫలితంగా ఎండ ప్రభావానికి గురికాకుండా ఉండొచ్ఛు.

* కర్భూజ: దీనిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, పిండి పదార్థాలు, పీచు ఎక్కువే. అందుకే దీన్ని తక్షణ శక్తి కోసం తీసుకోవచ్ఛు దీని వల్ల శరీరంలో నీటి నిల్వలు పెరుగుతాయి. కర్భూజ రసంలో ఉప్పు, పంచదార, కాస్త వెనిల్లా ఎసెన్స్‌ కూడా కలిపితే రుచిగానూ ఉంటుంది.

* కమలా/బత్తాయి/నిమ్మ: ఈ నిమ్మజాతి పండ్లలో శరీరానికి ఎంతో కీలకమైన పొటాషియం వంటి పోషకాలతో పాటు ఫైటోన్యూట్రియంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా విటమిన్‌ సి తగినంతగా లభిస్తాయి. ఇవి తక్షణశక్తిని ఇస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఎండబారిన పడకుండా తగిన రక్షణ కలిగిస్తాయి.


చల్లబరిచే పానీయాలివి...

వడదెబ్బ తగలకుండా, శరీరం డీహైడ్రేషన్‌కి గురికాకుండా... ఉండేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచన ఇది. గ్లాసులో పెద్ద చెంచా ఉప్పు, ఆరు చెంచాల పంచదార, వందగ్రాముల నీళ్లు కలిపి తాగితే మేలట.

* మజ్జిగ: పల్చటి మజ్జిగలో దబ్బ లేదా నిమ్మ ఆకుల్ని వేసి, కాస్త ఉప్పు, కరివేపాకు చేర్చి తాగితే....ఎంతటి వేడైనా ఉఫ్‌మని ఊదినట్లే పోతుంది.

* నిమ్మగడ్డి పానీయం: మార్కెట్‌లో దొరికే ఎండు నిమ్మగడ్డిని తెచ్చుకుని నీళ్లల్లో మరిగించాలి. మరో గిన్నెలో నాలుగు చెంచాల పంచదార వేసి, నీళ్లు పోసి పాకంలా తయారు చేసుకుని రెండూ కలపాలి. ఈ మిశ్రమాన్ని పండ్ల రసాల్లో, నీళ్లల్లో కలుపుకొని తాగితే శరీర ఉష్ణోగ్రతలు చల్లబడతాయి. అధికవేడి అదుపులో ఉంటుంది. వడదెబ్బ బారిన పడకుండా రక్షణ లభిస్తుంది.

* జల్‌జీరా నీళ్లు: నాలుగు చెంచాల ఆమ్‌చూర్‌ పొడిలో, అంతే పరిమాణంలో మెంతిపొడి, అరచెంచా వేయించిన జీలకర్ర పొడి, రెండు చెంచాల నల్ల ఉప్పు, పంచదార, అరచెంచా మిరియాల పొడి కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని చల్లటి నీళ్లల్లో కలుపుకొని తాగితే...డీహైడ్రేషన్‌ సమస్య చిటికెలో తీరిపోతుంది. జీర్ణవ్యవస్థ పనితీరూ మెరుగుపడుతుంది.

* కొబ్బరినీళ్లు: నిస్సత్తువుగా మారినప్పుడు, వడదెబ్బ తగలకుండా తక్షణ శక్తి కోసం కొబ్బరినీళ్లు తాగడం ఎంతో మేలు. దీనిలో కాస్త పంచదార చేర్చుకుని తాగొచ్ఛు దీనిలో పొటాషియం, ఎలక్ట్రోలైట్లు శరీరం తిరిగి చరుగ్గా మారడానికి సాయపడతాయి. సబ్జా, బార్లీ నీళ్లు కూడా ఎంతో మేలు చేస్తాయి.


ఉల్లిపాయ

ఉల్లిపాయ.. ఒంట్లోని వేడిని తగ్గించేందుకు చక్కటి ఉపాయం. ఎండలో బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు పెరుగులో పచ్చి ఉల్లిపాయ నంజుకుని తింటే మేలు. వడగాల్పు బారిన పడకుండా చేయడమే కాదు గ్యాస్‌ సంబంధిత సమస్యలకూ పరిష్కారం సూచిస్తుంది.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి

* పచ్చళ్లు, మసాలా పదార్థాలు, నూనెవంటలు, తీపి, బేకింగ్‌ పదార్థాలను ఎక్కువ తీసుకోవద్ధు వాటికి ప్రత్యామ్నాయంగా తాజా పళ్లను తినడం మంచిది.

* అన్నం వార్చిన గంజిలో కాస్త మజ్జిగ, అన్నం కలుపుకొని తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఎండ బారిన పడకుండా ఉంటారు. అంబలి, రాగిజావ, మజ్జిగలో నానబెట్టుకున్న అటుకులని కాస్త ఉప్పు వేసుకుని తినడమూ మంచిదే.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని