ఎవరీ ‘స్లమ్‌ చాందినీ’
close
Published : 06/06/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎవరీ ‘స్లమ్‌ చాందినీ’

డోలు చప్పుడు.. చుట్టూ చప్పట్లు.. ఇవేవీ పట్టించుకోకుండా తీగపై అడుగులు వేస్తోందో అమ్మాయి! ఆకలిని జయించడానికి అయిదేళ్ల వయసులోనే ఆ సాహసానికి పూనుకుందా చిన్నారి. అప్పుడు తన కోసం.. కుటుంబం కోసం.. కష్టపడింది. తనలా ఎవరూ బాధపడకూడదని పోరాటం మొదలుపెట్టింది. ఇప్పుడో వ్యవస్థగా ఎదిగింది నిరుపేద చిన్నారుల జీవితాల్లో వెన్నెల కురిపిస్తోన్న చాందినీని వసుంధర పలకరించింది..
మె పేరు చాందినీ. పేరులో ఉన్న వెన్నెల జీవితంలో లేదు. కడుపేదరికం. కుటుంబం నోయిడాలో ఉండేది. ఖాదర్‌ అలీషా, నూర్జహాన్‌ల పెద్ద కూతురు. అయిదేళ్ల వయసులోనే కుటుంబ భారాన్ని మోసే బాధ్యతను భుజానికెత్తుకుంది చాందినీ. ప్రాణాలకు తెగించి తీగపై నడిచే విన్యాసాన్ని చేస్తూ.. కాసులు సంపాదించి పెట్టేది. ఊరూరా ప్రదర్శనలిస్తూ దిల్లీకి చేరుకుందా కుటుంబం. కొన్నాళ్లకు ఖాదర్‌ జబ్బుపడ్డాడు. రోజుల్లోనే కుటుంబాన్ని అనాథగా వదిలేసి కన్నుమూశాడు. అప్పుడు చాందినీ వయసు ఎనిమిదేళ్లు. మళ్లీ నోయిడాకు వెళ్లిపోయిందా కుటుంబం.
చిత్తుకాగితాలు ఏరుతూ..
శూన్యంలోకి చూస్తున్న తల్లిని చూసి భయపడేది. తమ్ముడు ఆకలితో ఏడుస్తున్నాడని ఆమెకు అర్థమయ్యేది కాదు. చెల్లెలిని ఎలా ఓదార్చాలో తెలిసేది కాదు. పెందరాళే లేచి.. తన చిట్టి చేతులతో చిత్తు కాగితాలు ఏరేది. రోజంతా కష్టపడితే ఓ యాభై రూపాయలు పుట్టేవి. ‘ఓ రోజూ అలాగే పిల్లలందరితో కాగితాలు ఏరడానికి వెళ్లాను. పోలీసులు వచ్చి పట్టుకున్నారు. అలా తిరిగితే స్టేషన్‌లో వేస్తామని భయపెట్టి.. ఇంటికి పంపించేశారు. మర్నాడు మా ఇంటిపక్కనున్న అమ్మాయిల వెంట వెళ్లి పూలు అమ్మడం మొదలుపెట్టాను. అందరితో కలిసి రెడ్‌లైట్‌ ఏరియాలో రాత్రి పూట పూలమ్మేదాన్ని. ఓ రోజూ పోలీసులు చూశారు. నన్నూ స్టేషన్‌కు తీసుకెళ్లి.. కాసేపయ్యాక వదిలేశారు. ఆ పని కూడా నచ్చలేదు. మొక్కజొన్న పొత్తులు అమ్మడం మొదలుపెట్టా. డబ్బున్న పిల్లలు, మంచి మంచి దుస్తులు వేసుకున్న పిల్లలు వచ్చి పొత్తులు కొంటుంటే.. వారినే చూస్తూ.. నన్ను నేను చూసుకుంటూ బాధపడేదాన్ని’ అని గతం గుర్తుచేసుకుంది చాందినీ.

ఎనిమిదేళ్లలో..
ఏ దిక్కూ లేక సాగిపోతున్న చాందినీ జీవితంలో మొదటిసారి వెన్నెల కురిసింది. వారుంటున్న వీధికి ఓ సేవాసంఘం వచ్చింది. నిర్వాహకులతో తనకు చదువుకోవాలని ఉందని చెప్పింది చాందినీ. వారు చేరదీశారు. అలా పదోయేట అక్షరాలు దిద్దడం నేర్చుకుంది. 18 ఏళ్లు వచ్చే వరకూ అక్కడే ఉంది. పదో తరగతి పాసైంది. ఈ ఎనిమిదేళ్లు కేవలం చదువుకోలేదామె! మరెన్నో అద్భుతాలు సాధించింది. మురికివాడలన్నీ తిరిగి అక్కడి చిన్నారుల గురించి సర్వే చేసింది. ఎందరో పిల్లలను ఎన్జీవోలో చేర్చింది. తనకు దక్కిన అదృష్టాన్ని మరెందరికో పంచింది. యువతిగా మారాక.. మరింత ఉత్సాహంతో పని చేసింది. టెడెక్స్‌ వంటి వేదికలపై ప్రసంగించింది.  యునైటెడ్‌ నేషన్‌ కన్వెన్షన్‌ ఆన్‌ ద రైట్స్‌ ఆఫ్‌ ద ఛైల్డ్‌ (యుఎన్‌సీఆర్సీ)తో కలిసి పనిచేసింది. నేషనల్‌ కమిషన్‌ ఆఫ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఛైల్డ్‌ రైట్స్‌ (ఎన్‌సీపీసీఆర్‌)లో భాగంగా హరియాణా, దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలతో కలిసి పనిచేసింది. ఆమె చూపిన చొరవకు ఎన్నో అవార్డులు వరించాయి. ‘కరమ్‌ వీర చక్ర’ పురస్కారాన్నీ అందుకుంది.
వారికి అండగా..
చాందినీకి 18 ఏళ్లు వచ్చాయి. నిబంధనల ప్రకారం ఇక ఎన్జీవోలో ఉండకూడదన్నారు నిర్వాహకులు. చిన్నారులకు పాఠాలు చెప్పమన్నారు. నీడలో ఉన్న చిన్నారులకు తన అవసరం లేదనుకుందామె. ఏ అవకాశం లేక.. మురికివాడల్లో మగ్గుతున్న పిల్లల కోసం ఏదైనా చేయాలనుకుంది. మళ్లీ మొక్కజొన్న పొత్తులు అమ్మడం మొదలుపెట్టింది. మరోవైపు కుటుంబం కోసం దాచిన రూ.50 వేలను చిన్నారుల కోసం వినియోగించాలని నిర్ణయించుకుంది. ఈ ప్రయత్నంలో తనలా ఆలోచిస్తున్న దేవప్రతాప్‌ పరిచయమయ్యాడు. ‘ఇద్దరం కలిసి అక్కడి మురికివాడలన్నీ తిరిగేవాళ్లం. వాళ్లలో చదువుకోవాలనే ఆసక్తి ఉన్నవారిని గుర్తించాం. ఆ పిల్లలకు దుస్తులు, పుస్తకాలు కొన్నాం. చిన్న గదిని అద్దెకు తీసుకొని 2017లో ‘డాక్టర్‌ కలాం ఎడ్యుకేషన్‌ సెంటర్‌...వాయిస్‌ ఆఫ్‌ స్లమ్‌’ అనే ఎన్జీవోను ప్రారంభించామ’ని చెబుతుంది చాందినీ. కొన్ని రోజులకే డబ్బులైపోయాయి. అయినా ప్రయాణం ఆపొద్దనుకున్నారు. ఫేస్‌బుక్‌ను ఆశ్రయించారు. కేవలం ఒక్క రూపాయి సాయం కోరారు. రెండు రోజుల్లో ఏడువేలు పోగయ్యాయి. మళ్లీ ఉత్సాహంతో ముందుకెళ్లారు. బయట నుంచి విరాళాలు రావడం మొదలైంది. ‘దాతల చేయూతతో ముందుకువెళ్తున్నాం. ఇప్పుడు మా స్కూల్‌లో 370 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. వారికి ఆహారం, పుస్తకాలు సహా స్కూల్‌ ఫీజు వరకు మేమే అందిస్తాం. ఐదో తరగతి వరకూ ఇక్కడే చదివిస్తున్నాం. తర్వాత పాఠశాలలో చేర్పిస్తున్నామ’ని చెప్పుకొచ్చింది చాందినీ. వంద రూపాయలకు కష్టపడిన చాందినీ ఇప్పుడు నెలకు రెండు లక్షలు ఖర్చుపెట్టి.. ఏడుగురు ఉపాధ్యాయులతో పాఠశాల నిర్వహిస్తోంది. వచ్చే అయిదేళ్లలో పది పాఠశాలలను తెరవాలన్నదే తన లక్ష్యం అంటోంది చాందినీ. తమకు ఇంత చేస్తున్న ఆమెను మురికివాడలో పిల్లలంతా స్లమ్‌ చాందినీ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇన్ని ఘనతలు సాధించిన చాందినీ వయసు ఇప్పుడు 22 ఏళ్లే!


మురికివాడల బతుకు చిత్రాన్ని తెలియజేస్తూ ‘స్లమ్‌ పోస్ట్‌’ అనే త్రై మాసపత్రికను నిర్వహిస్తోంది చాందినీ. మూడు నెలలకు ఒకసారి వచ్చే ఈ పత్రికలో పనిచేసేవారంతా పదేళ్ల నుంచి పదిహేనేళ్లలోపు పిల్లలే. చదువుకుంటూనే దీనికి పనిచేస్తారు.  వెయ్యి పత్రికలు ప్రింట్‌ వేసి పాఠశాలలకు ఉచితంగా అందిస్తున్నారు. ‘ఓసారి 15 ఏళ్ల అమ్మాయి ఓ ఇంట్లో బందీగా ఉందన్న కథనం ఇచ్చాం. చైల్డ్‌లైన్‌ రంగంలోకి దిగి.. ఆమెను కాపాడింది. నేపాల్‌కు చెందిన పదేళ్ల అమ్మాయిని ఓ నలభై ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకొని మురికివాడలో మకాం పెట్టాడు. ఆ చిన్నారిని అతడు, అతని సోదరుడు, మామ కూడా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారన్న వార్తను ప్రచురించాం. ఇప్పుడు వాళ్లందరూ ఊచలు లెక్కపెడుతున్నారు. ఆ అమ్మాయిని తల్లి వద్దకు నేపాల్‌ పంపించేశామ’ని చెబుతోంది చాందినీ.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని