close

Published : 29/12/2020 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బంగారు బర్గర్‌ ఇది.. ధర నిజంగా నమ్మలేనిది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగారమేమైనా తింటామా... అని కొందరు అంటూ ఉంటారు. ఐతే బంగారాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవటం నిజానికి కొత్తేమీ కాదు. 5 వేల సంవత్సరాల క్రితం కూడా ఈజిప్షియన్లు పసిడిని ఆహారంగా తీసుకున్న దాఖలాలున్నాయి. అంతేకాకుండా భారత్‌, జపాన్‌, చైనా, అనేక యూరోపియన్‌ దేశాల్లో దీనిని ఆహారంగా, ఔషధంగా తీసుకునే సంప్రదాయం ఉంది. ఇక బంగారు పూత కలిగిన ఐస్‌క్రీములు, దోసెలు, పాన్‌లు ఇప్పడు మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా కొలంబియాలోని ఓ రెస్టారెంట్‌ 24 క్యారెట్ల బంగారంతో కూడిన బర్గర్‌ను వినియోగదారులకు అందుబాటులో తెచ్చింది.

సులభంగా లభించటంతో బాటు రుచికరంగా ఉండే ఫాస్ట్‌ఫుడ్ వెరైటీ.. బర్గర్‌. అవటానికి విదేశీ ఆహారమైనా ప్రస్తుతం భారత యువతలో అదో ట్రెండై కూర్చుంది. మిగిలిన వాటితో పోలిస్తే దీని ధర కూడా చాలా వరకు అందుబాటులోనే ఉంటుంది. చీజ్‌, రైస్‌, వెజిటబుల్‌, మీట్‌, చికెన్‌ తదితర అనేక శాకాహార, మాంసాహార రకాల్లో బర్గర్‌ లభిస్తుంది. అయితే ఈ రుచులకు ఇప్పుడు మరో కొత్త వెరైటీ తోడైంది. ‘ఓరో మెక్‌ కోయ్‌’ అనే పేరుతో ఓ ప్రత్యేక బర్గర్‌ ఇప్పుడు మార్కెట్లో లభిస్తోంది. డబుల్‌ మీట్‌, బేకన్‌, చీజ్‌లతో తయారయ్యే దీనిపై స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారపు పూత ఉండటం అసలు ఆకర్షణ. భోజనానికి మరింత రాచరికపు దర్జా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా చేశామని.. బంగారం ఆహార పదార్ధాలను అపూర్వమైనవిగా మార్చడమే కాకుండా.. తినేందుకు ఆకర్షణీయంగా కూడా చేస్తుందని ఆ రెస్టారెంట్‌ యాజమాన్యం అంటోంది.

ఐతే దాని ధర ఎంత అనే విషయం నెట్టింట్లో చర్చనీయాంశమైంది. దీని ఖరీదు ఎంత ఉంటుందో అనే అంశంపై సామాజిక మాధ్యమాల్లో పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వీరి సందేహాలకు సమాధానాన్ని సదరు రెస్టారెంట్‌ సామాజిక మాధ్యమాల్లో తెలిపింది. దీని ధర రెండు లక్షల కొలంబియన్‌ పెసోలని ప్రకటించింది. అబ్బో అంతా అని కంగారు పడకండి.. ఇది 57 అమెరికన్‌ డాలర్లకు సమానం. అంటే ఓ రూ.4191 మీవి కాదనుకుంటే ఈ బంగారు బర్గర్‌ను మీరూ హాయిగా బ్రేవ్‌ మనిపించొచ్చు. ఇంకెందుకాలస్యం.. ఈ బర్గర్‌ను పరిచయం చేసే వీడియో చూసేసి ఓ నిర్ణయానికొచ్చేయండి మరి!

ఇవీ చూడండి..

2000 ఏళ్లనాటి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌!

2020: జంతు ప్రపంచపు సిత్రాలు..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు